: రజనీకాంత్ ఇంటికి వచ్చిన మలేషియా దేశాధినేత!
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి అనుకోని అతిథి వచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే రజాక్, రజనీల మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఆపై రజనీ మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను మలేషియాలో ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు ప్రధానిని కలవలేకపోయానని, అందువల్ల ఇప్పుడు భారత పర్యటనలో ఉన్న తనను కలిసేందుకు ఆయనే స్వయంగా వచ్చారని, ఇది తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. మలేషియాకు బ్రాండ్ అంబాసిడర్ గా తనను ఉండాలని ఆయన కోరలేదని, ఈ విషయంపై వచ్చిన వార్తలు ఊహాగానాలేనని చెప్పారు. కాగా, రజనీకాంత్ కు మలేషియాలో అపార సంఖ్యలో అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయన చిత్రాలు విడుదలైతే, మలేషియాలో పలు కంపెనీలు ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటిస్తుంటాయి.