: సీబీఐపై విశ్వాసాన్ని బెయిల్ రద్దు చేసుకుని చూపించు!: జగన్ కు టీడీపీ సలహా
సీబీఐపై తనకు అమితమైన విశ్వాసం ఉన్నట్టు మాట్లాడుతూ, ప్రతి అంశంపైనా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, సీబీఐ పిటిషన్ ను గౌరవించాలని టీడీపీ సలహా ఇచ్చింది. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ప్రస్తావించిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఇప్పుడిక జగన్ తన బెయిలును రద్దు చేసుకుని జైలుకు వెళతారా? అని ప్రశ్నించారు.
జగన్ కు సీబీఐపై నమ్మకముంటే బెయిల్ రద్దుకు అంగీకరించాలని ఆయన అన్నారు. రోజుకో రకం మనస్తత్వాన్ని చూపుతున్న జగన్, సముద్ర తీరంలో వస్తున్న పరిశ్రమలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, సాక్షి ఇంటర్వ్యూలో వైఎస్ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఆధారంగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.