: ప్రవేశ పరీక్ష పాసైన విద్యార్థినికి.. బట్టతల ఉందని అడ్మిషన్ నిరాకరణ!
స్కూల్లో అడ్మిషన్ లభించాలంటే సాధారణంగా విద్యార్థుల ప్రతిభను చూస్తారు. వారు గతంలో సాధించిన మార్కులు, క్రీడల్లో తెచ్చుకున్న గుర్తింపు లాంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే, ఢిల్లీలోని స్కూల్లో అడ్మిషన్ పొందడానికి అన్ని అర్హతలు ఉన్న ఓ బాలిక విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొంది. ఆ విద్యార్థినికి బట్టతల ఉందని ఆమెకు అడ్మిషన్ ఇవ్వబోమని ఓ స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఆ విద్యార్థిని పేరు గుప్తా(13).
అలోపెషియా వ్యాధితో బాధపడుతుండడంతో ఆమెకి మూడేళ్ల వయసులోనే బట్టతల వచ్చింది. ప్రస్తుతం విడతలుగా చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో అన్షిత తొమ్మిదవ తరగతిలో చేరేందుకు తూర్పు ఢిల్లీలోని వనస్థలి పబ్లిక్ పాఠశాలలో అడ్మిషన్ కోసం వెళ్లి, స్కూల్ యాజమాన్యం తనకు అడ్మిషన్ ఇవ్వకపోవడంతో షాక్కు గురైంది. ప్రవేశ పరీక్షలో పాసైనప్పటికీ అన్షితకు ఆమె బట్టతలే శాపంగా మారింది. ఆమె బట్టతలను చూసి తోటి విద్యార్థులు హేళన చేస్తారన్న కారణంతోనే ఆమెకు అడ్మిషన్ ఇవ్వడం లేదని ఆ స్కూల్ యాజమాన్యం అంటోంది.
దీంతో కంగుతిన్న అన్షిత తల్లిదండ్రులు ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. విద్యార్థుల శరీరాకృతి చూసి అడ్మిషన్ ఇవ్వకపోవడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవేశ పరీక్షలో పాసయ్యాక స్కూల్ యాజమాన్యం మిగతా వివరాలు పూర్తిచేయాలని పిలిపించారని, చివరకు తాము స్కూలుకి వెళితే పాపను చూసి ఇలా చెప్పారని అన్నారు. చదువులో ముందుండే తమ కూతురు గతంలో చదివిన పాఠశాలలో ఎలాంటి అవమానాలు ఎదుర్కోలేదని వారు అన్నారు.