: హైదరాబాద్ లో దారుణం... ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ ఆత్మహత్య
అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు చూస్తే... అడ్డుగుట్ట తులసీనగర్‌లో నివాసం ఉండే శ్రీనివాస్ అనే యువకుడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రోజాను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, శ్రీనివాస్ ఏ పనీ చేయకుండా రోజూ రోడ్లపై తిరుగుతూ జల్సా చేసేవాడు.
కాగా, రోజా మాత్రం మగ్గం పనులు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న భార్యతో శ్రీనివాస్ గొడవపడ్డాడు. మనస్తాపం చెందిన రోజా ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడతో ఆమె శరీరం 80శాతం కాలిపోయి మృతి చెందింది. అయితే, రోజా మరణంపై రోజా కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వారే తమ కూతుర్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు.