: నా మాటలు బాధించి ఉంటే సారీ!: కోహ్లీపై వ్యాఖ్యలపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్
గాయంతో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన చివరి టెస్టు మ్యాచుకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాడ్జ్ విరాట్‌పై పలు వ్యాఖ్యలు చేసి, టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కాగా, బ్రాడ్ హాడ్జ్ తాజాగా స్పందిస్తూ... ధర్మశాలలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడానికి ఐపీఎల్ కారణమని తాను చేసిన వ్యాఖ్యలు కోహ్లీని కించపర్చడానికి కాదని చెప్పాడు. కీలకమైన చివరి మ్యాచ్‌లో కోహ్లీ ఆడకపోవడంతో తాను అలానే అర్థం చేసుకున్నానని అన్నాడు. గాయం తీవ్రత పెద్దగా లేనప్పుడు ఎవరైనా తనలాగే అనుకుంటారని చెప్పాడు. అయితే తన వ్యాఖ్యలు ఎవరినయినా గాయపరిచి ఉంటే క్షమించాలని అన్నాడు.
తన ఉద్దేశం ఏ ఒక్క ఆటగాడిని బాధపర్చాలని కాదని బ్రాడ్ హాడ్జ్ అన్నారు. ప్రస్తుతం ఎంతో మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ టోర్నమెంట్ కు ముందు నుంచే సన్నద్ధమవుతున్నారని అన్నాడు. ఐపీఎల్ కోసం ఎంతో మంది ఆటగాళ్లు దేశం తరఫున ఆడాల్సిన మ్యాచులను వదులుకుంటున్నారని పేర్కొన్నాడు. తన మాటలు కోహ్లీ అభిమానుల్ని నిరాశపర్చాయని, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని అన్నాడు.