: మానవత్వం స్పందించలేదు.. ప్రాణాలు కోల్పోయిన ప్రాణస్నేహితులు!
మానవత్వం మరుగున పడుతోందనడానికి ఈ ఘటన తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ముంబై, బాంద్రాలోని మీరా రోడ్డులోని కనాకియా రెసిడెన్సీ ప్రాంతంలో బిలాల్ రిజ్వీ కాలేజీలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సాద్ తీరందాజ్, బిలాల్ అన్సారీలు ప్రాణ స్నేహితులు. నిత్యం రద్దీగా ఉండే కాండ్విలి వద్ద ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీనిని చూసిన ఎవరూ వారిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. కనీసం తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించే ప్రయత్నం కూడా చేయలేదు.
దీంతో సమతానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బీట్ మార్షల్స్ కాండ్విలి వైపు వెళుతుండగా ప్రమాదానికి గురై పడి ఉన్న సాద్ తీరందాజ్, బిలాల్ అన్సారీ అనే ఇద్దరిని గుర్తించారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, నడి రోడ్డుపై విలవిల్లాడుతూ సాద్ అక్కడే ప్రాణాలు విడిచాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్సారీ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఏ ఒక్కరు స్పందించి మానవత్వం ప్రదర్శించినా వారు బతికే అవకాశం ఉండేదని వారు తెలిపారు.