: ఎంపీ గైక్వాడ్ కు మళ్లీ రైలు ప్రయాణం తప్పలేదు
ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ గైక్వాడ్ కు మరోసారి రైలు ప్రయాణం తప్పలేదు. మంగళవారం ముంబై నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన ఎయిర్ ఇండియా విమాన టికెట్ ను బుక్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎయిర్ ఇండియా ఆ టికెట్ ను రద్దు చేసింది. దీంతో చేసేదేమీ లేక మరో దారి లేక గైక్వాడ్ మంగళవారం సాయంత్రం రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఏసీ స్లీపర్ కోచ్ లో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో ప్రయాణం సందర్భంగా తనను బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీ క్లాస్ కు వెళ్లమన్నందుకు ఎంపీ గైక్వాడ్ ఆవేశంతో, ఎయిరిండియా ఉద్యోగిని చెప్పు తీసుకుని 25 సార్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం ఎంపీ గైక్వాడ్ ను ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణానికి అనుమతించకూడదని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు మద్దతుగా ప్రైవేటు ఎయిర్ లైన్ సంస్థలు కూడా ఆయనపై నిషేధం విధించడం తెలిసిందే. దీంతో నాలుగు రోజుల క్రితం రైలునే నమ్ముకున్న ఆయన మరోసారి విమానంలో ప్రయాణానికి ప్రయత్నించి విఫలమయ్యారు.