: టెస్టుల్లో నెం.1గా టీమిండియా స్థానం పదిలం.. మిలియన్‌ డాలర్ల చెక్కును అందుకున్న విరాట్ కోహ్లీ


ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా ఆట‌గాళ్లు ఈ రోజు మ‌రో శుభ‌వార్త అందుకున్నారు. ఈ సిరీస్‌ విజయంతో టెస్టుల్లో టీమిండియా త‌న‌ నంబర్‌ 1 ర్యాంక్‌ పదిలం చేసుకుంది. దీంతో ఏప్రిల్‌ 1 నాటికి అగ్రస్థానంలో ఉండే జట్టుకు అందించే మిలియన్‌ డాలర్ల చెక్కును ఈ రోజు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అందుకున్నాడు. ఈ టెస్టు సిరీస్‌కు ముందు కూడా నెంబ‌ర్‌1 గా ఉన్న టీమిండియా.. ఆస్ట్రేలియా నుంచి పోటీని ఎదుర్కుంది. ఈ రెండు జట్ల మధ్య కొన్ని పాయింట్లే తేడా ఉండ‌డంతో ఆ ర్యాంకు ఎవ‌రిసొంతం అవుతుంద‌ని క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేగింది.

పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ విజయం సాధించడంతో టీమిండియా అభిమానుల ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. అయితే, రెండో టెస్టు మ్యాచులో భార‌త్ విజ‌యం సాధించ‌డం, ఆ త‌రువాతి టెస్టు డ్రాగా ముగియ‌డం, తాజాగా నిర్ణ‌యాత్మ‌క చివ‌రిటెస్టులో టీమిండియా గెల‌వ‌డంతో అగ్ర‌స్థానం మ‌న‌కే ద‌క్కింది. ఈ రోజు  టెస్టు గదతో పాటు మిలియన్‌ డాలర్ల నగదు బహుమతిని సునీల్‌ గవస్కర్‌ చేతుల మీదుగా విరాట్‌ అందుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా 122పాయింట్లతో ఉండ‌గా, ఆస్ట్రేలియా108 పాయింట్ల‌తో రెండవ స్థానంలో ఉంది. ఇక ఆ త‌రువాత వ‌రుస‌గా దక్షిణాఫ్రికా(107), ఇంగ్లాండ్‌(101), న్యూజిలాండ్‌(98) క్రికెట్ జ‌ట్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News