: పాత నోట్ల మార్పిడి కుదరదని తేల్చిన సుప్రీంకోర్టు
తమ వద్ద ఖాతాదారులు డిపాజిట్ చేసిన రూ. 371 కోట్ల పాత నోట్లను మార్చేలా ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వాలని నాసిక్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ పెట్టుకున్న మధ్యంతర పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం, తాము ఈ పిటిషన్ ను తోసిపుచ్చుతున్నట్టు చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు నాసిక్ కో-ఆపరేటివ్ బ్యాంకు వాదనలు వినిపిస్తూ, ఇవన్నీ నవంబర్ 8 నుంచి 14 లోపు డిపాజిట్ అయినవేనని, వీటిని తీసుకోకుంటే, లిక్విడిటీ దెబ్బతిని, తమ 281 శాఖలను మూసేయాల్సి వస్తుందని పేర్కొంది. తమ క్లయింట్ వినతిని మన్నించాలని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ బ్యాంకు తరఫున వాదించారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇక మరోకేసులో రాను ఎంటర్ ప్రైజస్ నిరర్థక ఆస్తిగా ప్రకటించిన రూ. 10 కోట్లనూ మార్చుకునేందుకు కోర్టు అంగీకరించలేదు.