: జయలలిత కుమారుడినని చెప్పుకుంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు ఆదేశం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమారుడినని చెప్పుకుంటున్న జె.కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తాను జయలలిత కుమారుడినంటూ అతను సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవే అని పోలీసులు స్పష్టం చేయడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జయలలిత, నటుడు శోభన్ బాబులకు తాను జన్మించానని... జయ ఆస్తులకు అసలైన వారసుడిని తానే అని ఇతను కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కూడా ఇతను కోర్టును కోరాడు. ఈ నేపథ్యంలో, కోర్టుకు అతను సమర్పించిన ధ్రువపత్రాలు సరైనవి కాదని పేర్కొన్న కోర్టు... అవి అసలైనవో, నకిలీవో పరిశీలించాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో, ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవే అని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో, అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.