: తల్లిని హత్యచేసి పారిపోయిన యువకుడు!
వరంగల్ అర్బన్‌లోని కమలాపూర్ మండలం వంగపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తనని కనీ, పెంచి ప్రయోజకుడిని చేసిన తల్లిని దారుణంగా హతమార్చాడు ఓ కుమారుడు. వంగపల్లి గ్రామంలో నిగ్గుల రాయమల్లు, ఓదెమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. రాయమల్లు వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి చిన్న కూతురు సుకన్యకు విడాకులు కావడంతో నెల రోజుల క్రితం ఆమె అదే మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, ఆమెకు కొంత పెళ్లికానుకగా డబ్బులు ఇవ్వాలని రాయమల్లు, ఓదెమ్మ అనుకున్నారు.
అయితే, తన చెల్లి సుకన్యకు ఆ డబ్బు ఇవ్వకూడదని రాయమల్లు కొడుకు శంకర్ అన్నాడు. అంతేగాక, చెల్లెలితో మాట్లాడవద్దని తన తల్లిదండ్రులతో గొడవపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే బీరువాలోని రూ. 5వేల నగదు, 20 తులాల పట్టీలు, బ్యాంకు ఖాతాబుక్కు, పాన్ కార్డును శంకర్ తీసుకెళ్ళాడు. అతను కూడా అదే గ్రామంలో మరో ఇంట్లో ఉంటున్నాడు. దీంతో జరిగిన విషయాన్ని గ్రామ మాజీ ఎంపీటీసీకి తండ్రి రాయమల్లు చెప్పాడు.
శంకర్‌ను పిలిపించి ఈ విషయం గురించి ఎంపీటీసి అడిగాడు. దీంతో తల్లిదండ్రులపై మరింత ఆగ్రహం పెంచుకున్న శంకర్ కోపంతో వచ్చి తల్లితో గొడవపడి చెక్కతో ఓదెమ్మ తలపై బాదాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమై కింద పడిపోయింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు శంకర్ పరారీలో ఉన్నాడు.