: ఎమ్మెల్యేను గుర్తించని ఏపీ అసెంబ్లీ సిబ్బంది... గౌతు శ్యాంసుందర్ కు మరో అవమానం
పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీకి మరోసారి అవమానం ఎదురైంది. రెండు రోజుల క్రితం సీఎం కాన్వాయ్ వస్తోందంటూ, శివాజీ కారును ఉండవల్లి దగ్గర పోలీసులు అడ్డుకున్న విషయాన్ని మరచిపోకముందే, నేడు వెలగపూడి అసెంబ్లీలోకి ఆయన వెళుతుంటే, పోలీసులు అడ్డుకున్నారు. తాను పలాస ఎమ్మెల్యేనని చెప్పినా వారు వినలేదు. పక్కనే వెళుతున్న ఎమ్మెల్యేలు సైతం ఆయన ఎమ్మెల్యేనేనని చెప్పినా పోలీసులు శివాజీని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు.
చివరికి ఐడీ కార్డును ఆయన చూపించగా, సాధారణ పౌరులను తనిఖీ చేసినట్టుగానే ఆయన్నూ తనిఖీ చేసిన సెక్యూరిటీ, చివరికి అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ఆపై శివాజీ మాట్లాడుతూ, కనీసం పీఏను కూడా పెట్టుకోని తనను ఆపుతున్న భద్రతా సిబ్బంది, పది, పదిహేను మందిని వెంటబెట్టుకుని వచ్చే బొండా ఉమ, బుద్ధా వెంకన్నలకు సెల్యూట్ కొడుతున్నారని ఆరోపించారు.