: యూపీ పోలీస్ శాఖ ప్రక్షాళన: 100 మంది పోలీసులపై వేటు
ఉత్తరప్రదేశ్‌లో పెరిగిపోతున్న నేరాలను అరికడతామని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే పనిలో పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ ముందుగా అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 100 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ముఖ్యంగా ఘజియాబాద్, మీరట్, నోయిడా ప్రాంతాల్లోని పోలీసులపై ఈ వేటు వేశారు.
లక్నోలో సస్పెండ్ అయిన వారిలో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసులను సస్పెండ్ చేయాలని తమకు డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే సస్పెండ్ చేశామని యూపీ పోలీస్ పీఆర్వో రాహుల్ శ్రీవాత్సవ మీడియాకు చెప్పారు. సెస్పెండ్ అయిన వారిలో అధికమంది కానిస్టేబుల్ స్థాయిలోని వారేనని పేర్కొన్నారు.