: ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ!
ఎయిర్ ఇండియా ఉద్యోగస్తుడిపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన ప్రతాపం చూపారు. సదరు ఉద్యోగిని ఆయన చెప్పుతో కొట్టిన దారుణ సంఘటన ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. పైగా తన చర్యను గైక్వాడ్ సమర్థించుకోవడం గమనార్హం. ఈ రోజు ఉదయం పుణె నుంచి న్యూఢిల్లీ వెళ్లే విమానంలో ఆయన ప్రయాణించారు. ఉదయం పదకొండు గంటలకు న్యూఢిల్లీలో దిగిన అనంతరం, ఎయిర్ ఇండియా ఉద్యోగిపై ఈ దాడికి పాల్పడ్డారు.
తాను బిజినెస్ క్లాస్ టికెట్ కోసం డబ్బు చెల్లిస్తే, ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చారంటూ సదరు సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. బిజినెస్ క్లాసులో సీట్లు ఖాళీ లేకపోవడంతో ఎకానమీ క్లాసు టికెట్ ఇచ్చామని సిబ్బంది సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన రవీంద్ర గైక్వాడ్ తన చెప్పుతో ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడి చేశారు. ‘అవును, ఎయిర్ ఇండియా సిబ్బందిని కొట్టాను. ఎయిర్ ఇండియా సిబ్బంది వారి ఇష్టానుసారం మాట్లాడుతుంటే.. నేను మారుమాట్లాడకుండా ఉంటానని మీరు అనుకున్నారా?’ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమివ్వడం గమనార్హం. కాగా, ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని నియమించామని చెప్పారు.