: ‘ఫేస్ బుక్’ పై పాకిస్థాన్ లో నిషేధం?


ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ను తమ దేశంలో నిషేధించే విషయమై త్వరలోనే పాకిస్థాన్ నిర్ణయం తీసుకోనుంది. సామాజిక మాధ్యమాల ద్వారా దైవ దూషణలకు సంబంధించిన విషయాలను వ్యాపింప చేస్తున్నారని, అందువల్లనే, ‘ఫేస్ బుక్’పై నిషేధం విధించాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టు లో ఇటీవల పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ విషయమై ఈ నెల 27న జరిగే తదుపరి విచారణ నాటికి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షౌకత్ అజీజ్ సిద్దిఖీ పేర్కొన్నారు.

అసలు, సామాజిక మాధ్యమాల్లో దైవ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలు వస్తున్నాయా? లేదా? అనే విషయమై విచారణ నిర్వహించి ఓ నివేదిక ఇవ్వాలని పాకిస్థాన్ టెలి కమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ)ని కోర్టు ఆదేశించింది. తాము ఇప్పటికే విచారణ పూర్తి చేశామని, ఇంతకు ముందు ఒక వ్యక్తిని అరెస్టు చేశామని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ కోర్టుకు తెలిపారు.  దైవ దూషణకు సంబంధించి పోస్ట్ చేస్తున్న అంశాలను ‘ఫేస్ బుక్’ దృష్టికి కూడా తీసుకువెళ్లామని తెలిపారు. ఈ విషయమై పరిశీలించేందుకు ఒక బృందాన్ని పంపడానికి ఫేస్ బుక్ యాజమాన్యం అంగీకరించిందని కోర్టుకు తెలిపారు. ఫేస్ బుక్ యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలని, అయితే అంతవరకు మాత్రం, తమ దేశంలో ‘ఫేస్ బుక్’పై నిషేధం విధిస్తేనే మంచిదని కోర్టు అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News