: కవిత వ్యాఖ్యలకు లోక్ సభలో నవ్వులే నవ్వులు!
తెలంగాణ ఎంపీ కవిత వ్యాఖ్యలకు నిన్న లోక్ సభలో నవ్వులు విరిసాయి. లోక్ సభలో కవిత మాట్లాడుతూ, ‘ఏపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగం విన్న తర్వాత.. నేను ఏపీ అసెంబ్లీలో ఉన్నానా? అనే భావన కల్గుతోంది. అదేవిధంగా, యోగి ఆదిత్యనాథ్ స్పీచ్ విన్న తర్వాత నాకు యూపీ అసెంబ్లీలో ఉన్నట్టుగానూ తోస్తోంది’ అని ఆమె అనడంతో లోక్ సభ సభ్యులు పెద్దగా నవ్వేశారు. అంతకుముందు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాల్గో సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కి కూడా కవిత శుభాకాంక్షలు తెలిపారు. అదేసమయంలో, జైట్లీ గురించి కవిత చేసిన సరదా వ్యాఖ్యలకు ఆయన సైతం నవ్వుకున్నారు. తనకు కేటాయించిన మాట్లాడే సమయం ముగియడంతో, మరి కొన్ని నిమిషాలు అనుమతి ఇవ్వాలని కవిత కోరింది. అందుకు, ఒకటి లేదా రెండు నిమిషాలు అనుమతిస్తామని సభాపతి చెప్పారు. అందుకు కవిత స్పందిస్తూ..‘మూడు లేదా నాలుగు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే, జైట్లీజీ బిజీగా ఉన్నారు .. వినిపించుకోవడం లేదు’ అని అనడంతో జైట్లీ సహా సభ్యులందరూ నవ్వుకోవడం కనిపించింది.