: భార్యకు సంబంధించిన వివాదం.. మీడియాపై మండిపడ్డ సిద్ధూ
మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత సిద్ధూ పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఆయన భార్య నవజ్యోత్ కౌర్ కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూకు మీడియా ప్రతినిధుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. మీ భార్య మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు... అయినా, మీరు పాల్గొంటున్న అన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె ఎందుకు కనిపిస్తున్నారంటూ మీడియా ప్రశ్నించింది. దీంతో, సిద్ధూకు చిర్రెత్తుకొచ్చింది. ఆమె తనలో సగభాగమని సిద్ధూ ఘాటుగా సమాధానమిచ్చారు. మూడు సార్లు ఎంపీ అయిన తనకంటే ఆమెకే ఎక్కువ రాజకీయ అనుభవం ఉందని చెప్పారు.