: చంద్రబాబూ! మరోసారి సవాల్ విసురుతున్నా..ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రండి!: వైఎస్ జగన్
పరోక్ష ఎన్నికల్లో అవినీతికి పాల్పడి మూడు సీట్లు గెలుచుకుని, అదేదో, గొప్ప విజయంగా చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ సవాల్ విసిరారు. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.. లేదా వారిపై అనర్హత వేటు వేయించి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు మరోమారు సవాల్ విసురుతున్నానని జగన్ అన్నారు.
ఈరోజు ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరోక్ష ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచామని, అదేదో గొప్ప విజయంగా భావించిన చంద్రబాబు, ఈ విషయాన్ని అదేపనిగా అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారని జగన్ విమర్శించారు. ఇది ప్రజల తీర్పు అని చెప్పుకొంటున్న చంద్రబాబు సీఎం హోదాలో ఉండి పోలీసులను వినియోగించి, డబ్బు కుమ్మరించి ఆయా స్థానాల్లో విజయం సాధించారని ఆరోపించారు.