: స్పీకర్ కోరికపై పార్లమెంటులో 'దంగల్' ప్రదర్శన... కుటుంబ సభ్యులందర్నీ ఆహ్వానించిన స్పీకర్
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమాను పార్లమెంటులోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరిక మేరకు ఈ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. దీంతో పార్లమెంటు ఎగువ సభ, దిగువ సభ సభ్యులను కుటుంబసమేతంగా వచ్చి సినిమా చూడాలని స్పీకర్ ఆహ్వానించారు. ఈ నెల 23న ఈ సినిమాను బాలయోగి ఆడిటోరియంలో పార్లమెంటు సభ్యులకోసం ప్రదర్శించనున్నారు.
మహిళా సాధికారత, హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ సినిమా ఎంతో సహాయపడుతుందని భావించడంతో దీని ప్రదర్శనకు కోరానని ఆమె అన్నారు. ఇద్దరు ఆడపిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఒక తండ్రి పడిన కష్టమే 'దంగల్' సినిమా అన్న సంగతి తెలిసిందే. కాగా, గతేడాది 'చాణక్య' సినిమాను పార్లమెంటు సభ్యులకోసం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.