: బాలికను వేధిస్తూ ఫేస్‌బుక్‌లో లైవ్.. చూసి కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయని వైనం!
అమెరికాలోని షికాగో నగరంలో 15 ఏళ్ల బాలికను పలువురు వ్యక్తులు లైంగికంగా వేధించిన అంశం కలకలం రేపింది. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. సదరు బాలికను వేధిస్తుండగా ఆ దృశ్యాలు ఫేస్‌బుక్‌లోని ఫేస్‌బుక్ లైవ్ ఫీచర్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ప్రసారం అయ్యాయని, అయితే, ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు తమకు ఫిర్యాదు చేయకపోవడం తమకు బాధగా అనిపిస్తోందని అన్నారు. 911కు డయల్ చేయకుండా నెటిజన్లు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్నామని షికాగో పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఆ బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, షాపుకని వెళ్లిన తమ అమ్మాయి అదృశ్యమయిందని, దీంతో తాము పోలీసులకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తమ అమ్మాయిని పోలీసులు గుర్తించి తిరిగి తమకు అప్పగించారని చెప్పారు.