: బాలు, ఇళయరాజా కూర్చొని మాట్లాడుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు: వీఏకే రంగారావు
సినీ పరిశ్రమలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు ఇళయరాజాలు ఇద్దరూ దిగ్గజాలే. అంతకుమించి వీరిద్దరి మధ్య ఎంతో ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని వారిద్దరూ అనేక వేదికలపై ప్రపంచానికి తెలియజేశారు. అయితే, తాను స్వరపరిచిన గీతాలను ఆలపించడం సరికాదంటూ బాలుకు ఇళయరాజా నోటీసులు పంపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.
ఈ నోటీసుల వ్యవహారంపై విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ప్రముఖ నృత్యకారుడు, సినీ విశ్లేషకుడు, పాటల సేకరణలో లిమ్కా బుక్ రికార్డులకెక్కిన వీఏకే రంగారావు స్పందించారు. 'బాలు, ఇళయరాజా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే ఈ విషయం ముదిరేది కాదేమో' అని ఆయన చెప్పారు. చట్టపరంగా ఇళయరాజా ఇచ్చిన నోటీసులు సమంజసమేనని... అయితే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోటీసులు ఇవ్వడమే ఆశ్చర్యకరమని తెలిపారు.
వాస్తవానికి రాయల్టీ కోరే హక్కు రచయితలు, గాయకులు, స్వరకర్తలు, నిర్మాతలకు ఉంటుందని రంగారావు చెప్పారు. టికెట్లు వసూలు చేసే కార్యక్రమాలను నిర్వహించేవారు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటి కోసమే 1969లో ది ఇండియన్ పెర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ (ఐపీఆర్ఎస్) ఏర్పడిందని చెప్పారు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే వారి పాటలు పాడకూడదని తెలిపారు. గతంలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలు ప్రోగ్రామ్స్ కు రాయల్టీలు ఇచ్చేవని చెప్పారు. 50 ఏళ్ల నుంచి పాటలు పాడుతున్న బాలుకు ఐపీఆర్ఎస్ గురించి తెలియదా? అని ప్రశ్నించారు.