: బెంగళూరులో ‘కన్నడ భాష రాదా?’ అంటూ ఓ మహిళపై లైంగిక వేధింపులు!
ఓ మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తర బెంగళూరులో జరిగింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం, నిన్న రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి తన ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఓ వీధిలో వీరికి నలుగురు ఆకతాయిలు తారసపడ్డారు. అందులో, ఓ వ్యక్తి ఆ మహిళల వద్దకు వెళ్లి ‘కన్నడ భాషలో ఏదైనా మాట్లాడాలి’ అని అడిగాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కన్నడ భాషలో అసభ్యంగా వారిని ఉద్దేశించి మాట్లాడాడు.
అయితే, ఆ వ్యక్తి ఏం మాట్లాడింది సదరు మహిళకు, ఆమె స్నేహితురాలికి అర్థం కాలేదు. దీంతో, వారు నలుగురు మరింత రెచ్చిపోయారు. వాళ్లు స్థానికులు కాదని, తమ రాష్ట్రంలో నివసిస్తూ కన్నడ భాష ఎందుకు మాట్లాడటం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, కన్నడ భాష మాట్లాడని ఆ ఇద్దరిని మోకాళ్లపై కూర్చుని, క్షమించాలని ప్రార్థించాలని, లేకపోతే.. లైంగిక దాడి తప్పదంటూ ఆ నలుగురు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.