: ఇషాంత్ కు చిర్రెత్తుకొచ్చిన వేళ... చివరి రోజు ఆటలో ఆవేశం!
రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో చివరి రోజున పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ సహనాన్ని కోల్పోయాడు. నాలుగు రోజుల పాటు ప్రశాంతంగా కనిపించిన శర్మ, ఐదో రోజు మాత్రం ఆవేశాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 29వ ఓవర్ తొలి బంతిని వేసేందుకు ఇషాంత్ పరుగెత్తుకుంటూ వచ్చిన వేళ, రెన్ షా క్రీజు నుంచి తప్పుకున్నాడు. దీంతో అంపైర్ దాన్ని డెడ్ బాల్ గా ప్రకటిస్తుండగానే, చిర్రెత్తుకొచ్చిన ఇషాంత్, దాన్ని వికెట్లపైకి విసిరాడు. ఆ సమయంలో ఇషాంత్ వైఖరిపై మరో ఎండ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ ఏదో అనబోతే, ఇషాంత్ అంతే ఘాటుగా స్పందించి, తన కోపాన్ని చూపాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని కోహ్లీతో మాట్లాడాల్సి వచ్చింది. ఈ హడావుడిలో అదే ఓవర్ నాలుగో బంతికి రెన్షాను ఎల్బీ రూపంలో ఇషాంత్ అవుట్ చేయడం విశేషం. క్రీజు వదిలి వెళ్లే వేళ రెన్ షా, ఇషాంత్ ను దూషిస్తూ వెళ్లినట్టు టీవీ రీప్లేల్లో కనిపించింది.