: అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్ష... వ‌డ్డించాలంటే రెసిడెన్సీ ప్రూఫ్‌ చూపించ‌మ‌న్న వెయిట‌ర్‌!


అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంత‌రం ఆ దేశంలో జాతి వివ‌క్ష పెరిగిపోతోందన్నందుకు సాక్ష్యంగా ఎన్నో దారుణ ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఘ‌ట‌న వెలుగుచూసింది. హోట‌ల్‌కు వ‌చ్చి ఫుడ్ ఆర్డ‌ర్ చేసిన క‌స్ట‌మ‌ర్ల‌ను రెసిడెన్సీ ప్రూఫ్‌ (నివాస ధ్రువీకరణ పత్రం) చూపించాల‌ని అడిగాడో వెయిట‌ర్‌. చివ‌ర‌కు స‌ద‌రు క‌స్ట‌మ‌ర్‌ త‌మ వ‌ద్ద ఓ ఐడీ చూపించాకే ఫుడ్ స‌ర్వ్ చేసేందుకు ఒప్పుకున్నాడు.
 
పూర్తి వివ‌రాలు చూస్తే... లాటిన్‌ అమెరికాకు చెందిన డయానా కారిల్లో సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇటీవ‌లే తన స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలోని సెయింట్‌ మార్క్‌ అనే రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశాన‌ని, అయితే, ఆ ప‌దార్థాల‌ను తీసుకొచ్చిన ఓ వెయిట‌ర్ తాను వాటిని వడ్డించాలంటే రెసిడెన్సీ ప్రూఫ్ చూపించాలని అడిగాడని ఆమె చెప్పారు. ఎందుక‌ని ప్ర‌శ్నిస్తే, తాను సర్వ్‌ చేసే ముందు మీరిక్కడి వారేనా? అని తెలుసుకోవాలి క‌దా? అని ఎదురు ప్ర‌శ్నించాడ‌ని తెలిపారు. చివ‌ర‌కు తన‌తో పాటు ఆమె స్నేహితులు వారి వద్దనున్న రెసిడెన్సీ ఐడీలను చూపించామ‌ని ఆమె తెలిపారు.

వెయిటర్‌ వివక్షపూరిత చర్యపై ఆ రెస్టారెంట్ మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేశామ‌ని, మేనేజర్ త‌మ‌కు క్షమాపణ చెప్పి.. మరో చోట కూర్చోమని చెప్పార‌ని డయానా అన్నారు. అయితే, తాను త‌న‌ స్నేహితులతో క‌లిసి రెస్టారెంట్‌ నుంచి వెళ్లిపోయాన‌ని చెప్పారు. ఆమె చేసిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శ‌లు అధిక‌మవుతుండ‌డంతో ఆ వెయిటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. డయానాతో పాటు ఆమె స్నేహితులకు తమ రెస్టారెంట్లో వీఐపీ భోజనం ఆఫర్ చేస్తున్న‌ట్లు ఆ రెస్టారెంటు ప్ర‌క‌టించింది. తమ వారం రోజుల ఆదాయంలో 10 శాతం ఛారిటీకి కూడా ఇస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News