: విశ్వాసాన్ని చాటుకున్న శునకం.. యజమానిని కాపాడి ప్రాణాలొదిలింది!
విశ్వాసానికి మారుపేరు శునకం. ముద్ద అన్నం పెడితే జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది శునకం. తాజాగా ఓ శునకం తన స్వామి భక్తిని మరోసారి నిరూపించుకుంది. తన యజమానులను రక్షించుకునేందుకు ఏకంగా నాగుపాముతో పోరాడింది. చివరకు పాముకాటుకు గురై ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, గంగాధరన్ దంపతులిద్దరూ ప్రభుత్వ మాజీ అధికారులు. నెల రోజుల వయసున్న ఓ కుక్కను తీసుకొచ్చి, దానికి మౌళి అనే పేరు పెట్టి, పెంచుకుంటున్నారు. వారు ఇంట్లో ఉన్న సమయంలో ఐదడుగుల పొడవున్న ఓ నాగుపాము ఇంట్లోకి వచ్చింది. మూడేళ్ల వయసున్న మౌళి... తమ యజమానులను కాపాడేందుకు ఆ పాముతో పారాటం చేసింది. చివరకు ఆ పామును చంపేసింది. అయితే, అప్పటికే అది పాముకాటుకు గురవడంతో, ప్రాణాలు వదిలింది. తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న మౌళి, తమ కోసం ప్రాణాలు వదలడంతో, గంగాధరన్ దంపతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.