: ముఖ్యమంత్రుల్లో పెరుగుతున్న బ్రహ్మచారులు... రాష్ట్రాలను ఏలుతున్న అవివాహిత సీఎంలు!


దేశంలో పెళ్లికాని ముఖ్యమంత్రుల సంఖ్య పెరుగుతోంది. బహ్మచారుల ముఖ్యమంత్రుల జాబితాలో తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చేరిపోయారు. దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాలకు వివాహానికి దూరంగా ఉన్న వారే  ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి  నవీన్ పట్నాయక్‌ను మినహాయిస్తే మిగతా అందరూ బీజేపీకి చెందినవారే కావడం గమనార్హం.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, హరియాణా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్, అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి చెందినవారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తన జీవితం ప్రజాసేవకే అంకితమని పలుమార్లు ప్రకటించిన ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. పదిహేడేళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రి  పీఠంపై ఉన్న నవీన్ పట్నాయక్ తనకు పెళ్లి కాకపోవడమే మంచిదైందని పలుమార్లు పేర్కొన్నారు. తనకు వివాహం కాకపోవడం వల్ల రాష్ట్రానికి మేలే జరుగుతుందని, వారసత్వ రాజకీయాలు ఉండవని పేర్కొన్నారు.

యూపీ తాజా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటి నుంచో సన్యాస జీవితాన్ని గడుపుతున్నారు. రాష్ట్రానికి తొలి బ్రహ్మచారి సీఎం. అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన త్రివేంద్రసింగ్ రావత్ కూడా బ్రహ్మచారే. అస్సాం ముఖ్యమంత్రి  సోనోవాల్‌ కూడా వివాహానికి దూరంగా ఉండిపోయారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అవివాహితులే. యూపీకి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కూడా వివాహం చేసుకోలేదు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ వివాహం చేసుకున్నా, మొదటి నుంచీ కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు.

  • Loading...

More Telugu News