: రివ్యూలతో లాభపడ్డ ఇండియా, నష్టపోయిన ఆస్ట్రేలియా!
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో డీఆర్ఎస్ సమీక్షలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైన టీమిండియా, రాంచీలో మాత్రం సద్వినియోగం చేసుకుంటోంది. ఆట నాలుగో రోజైన నేడు, రెండో ఓవర్ తొలి బంతికే వికెట్ పోయే ప్రమాదంలో పడ్డ భారత జట్టు రివ్యూకోరి బతికిపోయింది. కమ్మిన్స్ బౌలింగ్ లో సాహా అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించగా, రివ్యూలో అతి తప్పని తేలింది.
ఆపై 155వ ఓవర్ లో లియాన్ వేసిన బంతిని పుజారా స్వీప్ చేయబోయాడు. అది టర్న్ అయి ప్యాడ్లకు తాకింది. మైదానంలోని అంపైర్ అవుట్ గా ప్రకటించగా, పుజారా రివ్యూకు వెళ్లాడు. ఈ సమయంలో రీప్లే వేసి చూడగా, అది నాటౌట్ గా తేలింది. ఇక ఆట 161వ ఓవర్ లో తన బాల్ సాహా బ్యాట్ కు తాకిందని భావిస్తూ, కీపర్ క్యాచ్ నిమిత్తం స్మిత్ రివ్యూ కోరగా, అది బ్యాటుకు తగల్లేదని స్పష్టమైంది. దీంతో ఆస్ట్రేలియా, తనకున్న రెండు రివ్యూల్లో ఒకదాన్ని కోల్పోయినట్లు కాగా, రివ్యూకు వెళ్లిన రెండుసార్లూ తుది నిర్ణయాలు ఇండియాకు అనుకూలంగా వచ్చాయి.