: పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తిన కిషన్ రెడ్డి
ఉత్తరప్రదేశ్ లో రైతుల రుణమాఫీ చేస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ... అది కేంద్ర ప్రభుత్వ నిధులతో జరగదని, యూపీ రాష్ట్ర నిధులతోనే జరుగుతుందని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ఈ మధ్య కాలంలో కొత్త నాయకుడు వచ్చాడని, ఏ మాత్రం అవగాహన లేకుండా సోషల్ మీడియాలో తుచ్ఛ రాజకీయాలు చేస్తున్నాడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన విరుచుకుపడ్డారు. తుచ్ఛ రాజకీయాల వల్ల ఉపయోగం లేదనే విషయాన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలని సూచించారు. కేవలం వార్తల్లో ఉండేందుకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం సరైన పద్ధతి కాదని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లో రైతుల రుణమాఫీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. యూపీలో రుణమాఫీ చేసినప్పుడు... తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రుణమాఫీ ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంపైనే ప్రేమను చూపిస్తున్న కేంద్ర పాలకులు... దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే, పవన్ కల్యాణ్ పై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.