: మొహం చాటేస్తున్న అనుచరులు... జైల్లో ఆగ్రహంతో ఊగిపోతున్న శశికళ!
బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని ఆయన కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ నెల 20న తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తోంది. దీంతో, శశికళకు పదవి కొనసాగుతుందా? లేక ఊడుతుందా? అనే చర్చ అన్నాడీఎంకేలో ఉత్కంఠను రేపుతోంది.
పన్నీర్ సెల్వం ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఆ పార్టీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనికి ఆమె అక్క కుమారుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సమాధానం ఇచ్చారు. అయితే, దినకరన్ ఇచ్చిన సమాధానాన్ని స్వీకరించేందుకు ఎలక్షన్ కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో, శశికళ నుంచే ఈసీ సమాధానాన్ని రాబట్టింది. శశికళ జవాబుపై పన్నీర్ సెల్వం మరోసారి ఈసీకి వివరణ ఇచ్చారు. పన్నీర్ వివరణను ఖండిస్తూ శశికళ మరోసారి ఈసీకి లేఖ రాశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ లేఖల ఎపిసోడ్ నడిచింది.
ఈ సమస్యతో ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న శశికళకు మరో విషయం మింగుడుపడటం లేదు. జైల్లో ఉన్న తనను పరామర్శించేందుకు వస్తున్న నేతల సంఖ్య తగ్గిపోయింది. తాను జైలుకు వచ్చిన తొలి నాళ్లలో తనను కలిసిన నేతలు కూడా, క్రమంగా కనుమరుగు అయ్యారు. దీంతో, ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట. శశిని ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పళనిస్వామి కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం మంత్రులు కూడా తనను కలవడానికి రావడం లేదని ఆమె రగిలిపోతున్నారని సమాచారం.