: తొలి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి టీమిండియా 120/1
టీమిండియా ఆటగాళ్లను పెవిలియన్ కు పంపేందుకు ఆసీస్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆటగాళ్లను రవీంద్ర జడేజా కట్టడి చేయడంతో, దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. ఒక ఎండ్ నుంచి నాధన్ లియాన్ బౌలింగ్ దాడి ప్రారంభించగా, మరో ఎండ్ లో ఒకీఫ్ దూకుడుగా బంతులేశాడు. వీరిద్దర్నీ టీమిండియా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ (67), మురళీ విజయ్(42), ఛటేశ్వర్ పుజారా (10) సమర్థవంతంగా అడ్డుకున్నారు. కొత్త బౌలర్ పాట్ కమ్మిన్స్ వేసిన స్లో బౌన్సర్ ను ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో బంతి అతని గ్లోవ్ ను తాకుతూ కీపర్ వేడ్ చేతుల్లో వాలింది. దీంతో రాహుల్ ను కమ్మిన్స్ పెవిలియన్ కు పంపి ఆసీస్ కు తొలి వికెట్ ను బోణీగా అందించాడు.
అనంతరం 39వ ఓవర్ 2వ బంతిని లియాన్ సంధించగా, విజయ్ దానిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అది బ్యాటుకి తగలకుండా ప్యాడ్ కు తగిలి పైకి లేచింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు అవుట్ అంటూ అప్పీలు చేశారు. అంపైర్ దానిని అవుట్ ఇవ్వకపోవడంతో స్మిత్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు దూరంగా పడి దూరంగా వెళ్తూ ప్యాడ్ కు తాకిందని తేలింది. దీంతో ఆసీస్ తొలి రివ్యూను కోల్పోయింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు 40 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు చేశారు. దీంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసింది.