: యూపీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయం ఏకంగా రూ.5500 కోట్లు!
ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు పోటాపోటీగా ప్రచార సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఖర్చుపై జరిపిన ఓ సర్వే పలు వివరాలు తెలిపింది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఏకంగా రూ.5,500 కోట్లు ఖర్చు పెట్టాయి. ఎన్నికల్లో తమకే ఓటు వేయమని ఓటర్లకు పంచిన డబ్బు మొత్తం రూ.1000 కోట్లని ఆ సర్వే ద్వారా తెలిసింది. ఇక స్క్రీన్ ప్రొజెక్షన్లు, వీడియో వ్యాన్లు, ఎలక్ట్రానిక్ మెటీరియల్ వంటి వాటి కోసం మొత్తం ఆయా పార్టీలు రూ.600 నుంచి 700 కోట్లను ఖర్చు చేశాయని సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో ఒక్కో ఓటు విలువ రూ.750 ఉందని, ఇది దేశంలోనే అత్యధికమని అందులో తెలిపారు. దేశంలో మూడింట ఒక వంతు మంది ఓటర్లు ఓటుకు డబ్బు లేక మద్యాన్ని తీసుకుంటున్నట్లు అందులో చెప్పారు.