: కారులో కన్నతండ్రి ఎదుటే అతని కుమార్తెలపై సామూహిక అత్యాచారం
మానవత్వాన్ని మంటగలిపే మరో ఘోరం జరిగిపోయింది. కన్నతండ్రి ఎదుటే నడుస్తున్న కారులో ఇద్దరు బాలికలపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుజరాత్ లోని దాహోద్ జిల్లా దేవ్ గడ్ తాలూకా పరిధిలో ఈ ఘోరం నిన్న జరిగినట్టు పోలీసులు ఈ రోజు వెల్లడించారు. బాలికల అపహరణ, అత్యాచారం కేసులో 13 మందికి గాను ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
13, 15 ఏళ్ల వయసున్న బాలికలు, ఆమె తండ్రి భూట్ పాగ్లా గ్రామంలోని తమ షాపులో ఉండగా నిందితులు వారిని స్పోర్ట్స్ కారులో అపహరించి అత్యాచారం జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. బాలికల సోదరుడిపై ప్రతీకారాన్ని ఇలా తీర్చుకుంటున్నట్టు నిందితుల్లో ఒకడు ఆ కారులో ఉన్న వారి తండ్రికి చెప్పినట్టు పేర్కొన్నారు. అనంతరం నిందితులు బాలికలు, ఆమె తండ్రిని మండవ్ గ్రామం సమీపంలో వదిలేసి, పోలీసులను ఆశ్రయించవద్దని హెచ్చరించి వెళ్లినట్టు తెలిపారు. పోలీసులు బాలికలు ఇద్దర్నీ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 13 మందిపై కేసు నమోదు చేశారు.