: నన్ను బురదలో నడిచేలా చేస్తావా!..నిన్ను ఏడ్చేలా చేస్తా!: అధికారిపై ఎమ్మెల్యే ఆజాం ఖాన్ మండిపాటు
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలిచే సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ మరోమారు తన నోటికి పని చెప్పారు. ఇటీవల నిర్వహించిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రామ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నెల 11న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆయన ఆకక్ది సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభయ్ కుమార్ గుప్తాతో దురుసుగా ప్రవర్తించారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం, తాను గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేందుకు సంబంధిత కార్యాలయం వద్దకు ఆయన వెళ్లారు.
కౌంటింగ్ కేంద్రంలోకి ఆయన కారును అనుమతించకపోవడంతో, బురద రోడ్డులో నడుచుకుంటూ వెళ్లిన ఆయన, అభయ్ కుమార్ గుప్తాపై మండిపడటమే కాకుండా చాలా కటువుగా మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ కోడ్ అమల్లో ఉండదు. అప్పుడు, నీ సంగతి చూస్తా, నన్ను బురద రోడ్డులో నడిచేలా చేస్తావా? నువ్వు ఏడ్చేలా చేస్తా...అధికారం ఉందని ఇలా ప్రవర్తిస్తావా?’ అంటూ ఆజంఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అవడం గమనార్హం.