: మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు.. మళ్లీ ఎమ్మెల్యేలు కాలేరు: వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తోన్న సాయంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం చేస్తుండగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అభ్యంతరాలు చెబుతూ అడ్డుతగిలారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని, పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా చెప్పలేదని చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక మొత్తం ప్రధాని మోదీని 10 సార్లు, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని 16 సార్లు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని 18 సార్లు కలిసి రాష్ట్ర సమస్యలపై, ప్రయోజనాలపై మాట్లాడానని చెప్పారు.
అంతేగాక, 56 సార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్యులను కలిశానని చంద్రబాబు అన్నారు. ఓవైపు తాము రాష్ట్రాభివృద్ధి కోసం కృషిచేస్తోంటే మరోవైపు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అనంతరం ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పత్రాన్ని చంద్రబాబు నాయుడు చదవడం ప్రారంభించారు. అయితే, వైసీపీ నేతలు ప్రసంగాన్ని అడ్డుకుంటూ అభ్యంతరం చెబుతుండడంతో ఆగ్రహించిన చంద్రబాబు కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్‌ను చదువుతున్న సమయంలో అడ్డుతగులుతున్నారని, రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరుగుతున్నా భరించలేకపోతున్నారని ఆయన అన్నారు.
వారికి సంప్రదాయాలు లేవని చంద్రబాబు మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదని అన్నారు. వైసీపీ నేతలు విషయాన్ని స్టడీ చేయరని అన్నారు. వారు శాసనసభలో తమాషాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. నిన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్యాకేజీ విషయంలో ఇచ్చిన స్టేట్ మెంట్‌ను తాను చదివి వినిపిస్తోంటే, 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని తెలుపుతుంటే వైసీపీ నేతలు అడ్డుతగలడమేంటని, అంత బాధెందుకని ఆయన ప్రశ్నించారు. వారు మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారని, మళ్లీ ఎమ్మెల్యేలు కాలేరని ఆయన వ్యాఖ్యానించారు.