: మాయావతి కోర్టుకంటే ముందు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి: బీజేపీ సూచన
ఈవీఎం మెషిన్లను ట్యాంపర్ చేశారంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి చేస్తున్న దుష్ప్రచారంపై బీజేపీ మండిపడింది. ఈ అంశంపై కోర్టుకు వెళతామని కూడా ఆమె ప్రకటించారు. దీనిపై ఈ రోజు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య లక్నోలో స్పందించారు. మాయావతి కోర్టుకు వెళ్లినా తాము పట్టించుకోబోమన్నారు. కానీ కోర్టుకు వెళ్లడానికంటే ముందు మాయావతి ఆస్పత్రికి వెళ్లి తగిన చికిత్స తీసుకోవాలని, ఆమెకు విశ్రాంతి అవసరమని మౌర్య ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 19 సీట్లలోనే గెలవడం ద్వారా దారుణమైన ఫలితాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాన్ని తక్కువ చేసేందుకు వ్యూహాత్మకంగా మాయావతి ఈవీఎం మెషిన్లు ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలను తెరపైకి తెచ్చారు. ఎవరికి ఓటేసినా బీజేపీకే పడేట్టు మెషిన్లలో మార్పులు చేశారని ఆమె ఆరోపించారు.