: ఆ గ్రామంలో ఏ ఇంటి తలుపు చూసినా ‘లక్ష్మీ’ పేరే!


మహారాష్ట్రలోని లాతూరు జిల్లా, నిలంగ తాలూకాలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి ప్రవేశిస్తే ఓ అంశం కామన్ గా కనిపిస్తుంది. ఏ ఇంటి ముందు ఆగి పరిశీలించి చూసినా నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. దానిపై ఆ ఇంటి ఇల్లాలు లేదా ఆ ఇంట్లోని ఆడపిల్ల పేరు, ఫోన్ నంబర్ కూడా రాసి ఉంటుంది. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా...? అయితే మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.

ఆ గ్రామం పేరు ఆనందవాది. పేరులో ఉన్నట్టే ఈ గ్రామ వాసులు కూడా ఆనందంతో కలసిమెలసి జీవిస్తుంటారు. ఈ గ్రామ జనాభా కేవలం 635 మంది. ఓ రోజు గ్రామ సభలో వచ్చిన సలహాకు అందరూ సరే అనేసి ఇళ్లు, ఆస్తులను మహిళల పేరు మీదకు మార్చేస్తున్నారు. ‘‘ప్రతి దీపావళికి లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తుంటాం. అలాగే ఈ నిర్ణయం ద్వారా మా లక్ష్మీలను (కుమార్తెలు, భార్య) గౌరవించాలని నిర్ణయించాం. మహిళలు మరొకరిపై ఆధారపడాలని భావించరాదు. ఇళ్లను నడిపించేది వారయినప్పుడు అదే ఇల్లు వారి పేరిట ఎందుకు ఉండకూడదు?’’ అని గ్రామసభ సభ్యుడు న్యానోబా చామే అన్నారు.

ఈ గ్రామంలో 165 ఇళ్లు ఉన్నాయి. అన్నీ కూడా మహిళల పేర్లతో ఉన్నవే. మరికొందరు అయితే, తమ పేరిట ఉన్న పొలాలను కూడా తమ ఇంట్లో ఆడవారి పేరు మీదకు మార్చేశారు. ఈ గ్రామంలో గత 15 ఏళ్ల కాలంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. వివాద రహిత గ్రామం కావడంతో ఉత్తమ గ్రామంగా అవార్డు కూడా లభించింది. ఈ గ్రామంలో ఉన్న 400 మంది పురుషులు తమ మరణానంతరం అవయవ దానానికి అంగీకారం తెలిపారు. కొందరైతే తమ దేహాలను వైద్య పరిశోధనలకు అందించాలని కోరారు. ఈ గ్రామస్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఏకైక కోరిక... లాతూరు జిల్లా ఆస్పత్రిలో అవయవ మార్పిడి వసతులు కల్పించాలని. ఇంకా ఈ గ్రామంలో పొగతాగడం, పొగాకు తినడం, మద్యసేవనం పూర్తిగా నిషేధం.

  • Loading...

More Telugu News