: ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి?: గిలానీ, యాసిన్ మాలిక్ కు ఈడీ సమన్లు
జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేతలు అలీషా గిలానీ, యాసిన్ మాలిక్ లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన (ఫెమా) కింద కశ్మీర్ వేర్పాటువాద నేతలు సయీద్ అలీషా గిలానీ, యాసిన్ మాలిక్‌లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ అయిన మాలిక్ ను ఈనెల 28న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన ఈడీ, హురియత్ చైర్మన్ గిలానీని ఏప్రిల్ 3న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2001లో హైదర్ పొరాలోని గిలానీ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సమయంలో 10 వేల డాలర్లు పట్టుబడ్డాయి.
ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అన్న ప్రశ్నలకు గిలానీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ 2003లో ఐటీ శాఖ పంపిన సమన్లకు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఈడీ విచారించాలని భావించి, సమన్లు పంపింది. మరోపక్క, 2001లో పోలీసులు ముస్తాఖ్ అహ్మద్ డర్, ఆయన భార్య షిజియా రసూల్ ల నుంచి లక్ష డాలర్ల మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా, నేపాల్ కు చెందిన అల్టాఫ్ ఖాద్రి అనే వ్యక్తి ఆ సొమ్మును యాసిన్ మాలిక్ కు అందజేయాలని ఇచ్చాడని తెలిపారు. ఖాద్రీ నేపాల్ నుంచి ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కార్యకర్తగా పని చేస్తున్నాడని విచారణలో వెల్లడించాడు. దీంతో యాసిన్ మాలిక్ ను అరెస్టు చేసిన పోలీసులు, బెయిల్ పై విడుదల చేశారు. అనంతరం 2014లో కశ్మీర్ ను ముంచెత్తిన వరదల్లో ఐటీ శాఖకు చెందిన కీలక డాక్యుమెంట్లు కొట్టుకుపోవడంతో ఈ కేసు విచారణ క్లిష్టంగా మారింది.