: మోదీ భయం.. 'అమ్మ' క్యాంటీన్ల తరహాలో 'నమ్మ' క్యాంటీన్లు
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం అలర్ట్ అయింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, మోదీ చరిష్మాను ఎదుర్కోవడానికి, ప్రజలను ఆకర్షించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెడుతోంది. అమ్మ క్యాంటీన్ల తరహాలో నమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు.
ఐదు రూపాయలకే టిఫిన్, పది రూపాయలకే భోజనం అందించేలా నమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు వ్యాప్తంగా 198 నమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మిగిలిన జిల్లాల్లో 'సవిరుచి సంచారీ' పేరిట మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ తరహా క్యాంటీన్లు ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, ఏపీ, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి.