: ఇది భారీ బడ్జెట్ కాదు.. బడాయి బడ్జెట్!: విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
తెలంగాణ శాసనసభలో 2017-18 వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న సర్కారు ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో అంకెలు మాత్రమే మారాయని, కొత్తదనమేమీ లేదని చెప్పారు. గత ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో 60 నుంచి 70 శాతం మధ్య మాత్రమే ఖర్చు చేయగలిగారని చెప్పారు. ఇది భారీ బడ్జెట్ కాదని, బడాయి బడ్జెట్ అని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి గత పాలకులు అన్యాయం చేశారనే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికయినా ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. వారి ఆశలకు అనుగుణంగా పాలన కొనసాగాలని అన్నారు. లేనిది ఉన్నట్లుగా చూపి ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం సరికాదని విమర్శించారు.