: గోవా బీచ్ లో నగ్నంగా విదేశీ మహిళ మృతదేహం
విదేశీ పర్యాటకులకు స్వర్గధామమైన గోవాలో ఓ విదేశీ మహిళ దారుణ హత్యకు గురైంది. ఐర్లండ్ దేశానికి చెందిన ఈమె తన ప్రియుడితో కలసి ఇటీవల గోవాకు వచ్చింది. వీరిద్దరూ స్థానికంగా జరిగిన హోలీ వేడుకలో సైతం పాల్గొన్నారు. అనంతరం ఆమె అదృశ్యమైంది. నిన్న ఉదయం ఆమె మృత దేహం బీచ్ లో కనిపించింది. నగ్నంగా ఉన్న ఆమె శరీరం రక్తపు మడుగులో పడి ఉంది. ఈమె మృత దేహాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృత దేహాన్ని గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. హత్య చేయడానికి ముందు ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి ప్రియుడిని కూడా పోలీసులు విచారించారు. హోలీ వేడుక సందర్భంగా ఆమె ఎవరితో సన్నిహితంగా మెలిగిందన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె ప్రియుడు తెలిపిన వివరాల మేరకు కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారిస్తున్నారు.