: రాంగ్ రూట్లో వెళ్లద్దన్నందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కత్తితో పొడిచిన మోటార్ సైక్లిస్ట్!
రోడ్డు నిబంధనలు పాటించకుండా వెళుతున్న వారికి అలా వెళ్లకూడదని మంచిమాట చెప్పినందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కత్తిపోటుకు గురయిన ఘటన పుణె నగరంలోని ఫెర్గూసన్ కాలేజి రోడ్డులో చోటు చేసుకుంది. ఓ మోటారు సైక్లిస్టు అతడిని కత్తితో పొడిచేయడంతో ఊపిరితిత్తుల దిగువ భాగంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని స్నేహితులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంతో ఆ ఇంజనీర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కత్తి పోటు ఏమాత్రం కాస్త పక్కకు దిగినా అతడు దక్కేవాడు కాదని వైద్యులు చెప్పారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆసక్తి చూపలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంటులో డిన్నర్ చేద్దామని వచ్చాడు. డిన్నర్ చేశాక నిన్న రాత్రి 11.30 గంటలకు వారు బయటకు వచ్చి నిలబడ్డారు. అయితే, అదే సమయంలో రాంగ్‌రూట్లో వస్తున్న ఓ మోటారు సైక్లిస్టు వారితో వాదనకు దిగాడు. బాధితుడు అతడి మీద మండిపడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పాడు. ఆగ్రహం తెచ్చుకున్న నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పొట్టలో కత్తితో పొడిచేసి పారిపోయాడు.