: అమెరికా బయలుదేరిన జర్మనీ ఛాన్సలర్.. వాతావరణం బాగోలేదని చెప్పిన ట్రంప్.. పర్యటన వాయిదా
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఏంజెలా మెర్కెల్ అమెరికా వెళ్లడానికి ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అయితే, అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి తమ దేశంలో వాతావరణ పరిస్థితులు బాగోలేవని చెప్పడంతో మెర్కెల్ అమెరికా పర్యటన వాయిదా పడింది. అయితే, ఆ ఫోన్ కాల్ రావడానికి ముందే మెర్కెల్ పార్టీకి చెందిన కొందరు నేతలు, మీడియా వ్యక్తులు విమానం ఎక్కి కూర్చున్నారు. దీంతో ఆమె విమానాశ్రయానికి వెళ్లి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో తుపాను ఏర్పడిందని ఈ కారణంగా కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని వైట్‌హౌస్ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో మెర్కెల్ తన అమెరికా పర్యటనను శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు.