: మరణిస్తానని మా నాన్నకు ముందే తెలుసేమో..!: అఖిలప్రియ

"శోభా నాగిరెడ్డి చనిపోయిన తరువాత కూడా, నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన సమయంలో నాకు భయం అనిపించలేదు. మా నాన్న ఉన్నాడన్న ధైర్యం ఉండేది. ఆయన చెయ్యి పట్టుకుని వచ్చాను. ఆయనే ప్రతి ఒక్కరినీ పరిచయం చేశారు. అందరికీ నన్ను దగ్గర చేశారు. ఈ రోజు వస్తుందని ఆయనకు ముందే తెలుసేమో. అందుకే అందరికీ నన్ను దగ్గర చేశారు. మా అమ్మా, నాన్నల పెళ్లి జరిగే సమయానికి ఫ్యాక్షన్ జరుగుతూ ఉండేది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మమ్మల్ని ప్రేమగా పెంచి పెద్ద చేశారు. ఈ స్థాయిలో నిలిపారు. ఎప్పుడైతే అమ్మ చనిపోయారో, అప్పటి నుంచి ఆయన కోలుకోలేక పోయారు. ఆయన ఎంత బిజీగా ఉంటే, అంత త్వరగా మరచిపోతారని మేము అనుకున్నాం. కానీ బయటకు ధైర్యంగా ఉన్నా, రోజూ రాత్రి అమ్మ ఫోటోకు దండం పెట్టి దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా" అంటూ అఖిలప్రియ కన్నీళ్లు పెట్టుకున్నారు.

భార్య మరణం తరువాత ఆయన ఎంత ప్రయత్నించినా, బాధ నుంచి బయటకు రాలేకపోయారని, దాంతో ఆరోగ్యం మెల్లిమెల్లిగా పాడవుతూ వచ్చిందని చెప్పారు. గత వారమంతా ఆయన ఆసుపత్రిలో ఉన్నారని, ఆ సమయంలో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆలోచించారని, ఆఖరికి టెలీ కాన్ఫరెన్స్ లోనూ పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ మాస్క్ తోనూ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంపై మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. తాను మరణిస్తానేమోనని ఆయన ముందుగానే ఊహించినట్టు ఇప్పుడు అనిపిస్తోందని, అందుకే చివరి రోజుల్లో నంద్యాల, ఆళ్లగడ్డ అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు కట్టించాలని గట్టి ప్రయత్నాలు చేశారని వెల్లడించారు.

More Telugu News