: అప్పుల్లో పంజాబ్.. ప్రధానిని కలుస్తానంటున్న కొత్త ముఖ్యమంత్రి!
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం, పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, పంజాబ్ లో గెలిచామనే సంతోషం ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ కు లేకుండా పోతోంది. ఎందుకంటే, ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న పంజాబ్ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పంజాబ్ ప్రభుత్వం లక్షా పాతిక వేల కోట్ల మేరకు అప్పు పడిపోయింది.
ఈ అప్పుల బారి నుంచి రాష్ట్రం బయట పడటం చిన్న విషయం కాదు. దీనికి తోడు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా, ప్రజా సంక్షేమ పథకాల కోసం మరిన్ని నిధులు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సాయం పంజాబ్ రాష్ట్రానికి తప్పనిసరి. మోదీ ప్రభుత్వం తమకు సాయం చేస్తుందనే ఆశాభావంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నారు. త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తానని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆయనకు వివరించి, తమ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చిస్తానని అమరీందర్ సింగ్ పేర్కొనడం గమనార్హం.