: ఎండలో నిలబడి నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్య
అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఈ రోజు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభా ప్రాంగణంలో తమ నిరసన వ్యక్తం చేస్తూ, ఎండలో నిలబడ్డారు. సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం సభాపతికి లేనప్పటికీ, తాము గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామనే నెపంతోనే బయటకు పంపారని, బడ్జెట్ సమావేశాల్లో తమ గొంతు నొక్కాలనే ఉద్దేశంతోనే ఈవిధంగా చేస్తున్నారంటూ వారు మండిపడ్డారు. తమను సస్పెండ్ చేసిన విషయమై గవర్నర్ నరసింహన్ కు వివరించేందుకు గురువారం ఆయన్ని కలవనున్నామన్నారు. కాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసన తెలపాలని టీడీపీ నిర్ణయించింది. ఖమ్మంలో జరిగే నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.