: ఒడిషా బీజేపీ ఉపాధ్యక్షుడికి చెంపదెబ్బలు!
ఒడిషా బీజేపీ ఉపాధ్యక్షుడు సమీర్ మొహంతిపై ఆ పార్టీ సీనియర్ నేత జయనారాయణ్ మిశ్రా అనుచరులతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. సంబల్ పూర్ జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడని కూడా చూడకుండా జయనారాయణ్ మిశ్రా అనుచరులు దాడికి దిగారు. ఆయన చెంపలపై కొట్టి, ఆయనపైకి చెప్పు విసిరారు. దీనిపై పార్టీ తీవ్రంగా స్పందించింది. దీంతో జయనారాయణ్ మిశ్రాతో పాటు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు నౌరి నాయక్, జడ్పీకి కొత్తగా ఎన్నికైన మరో తొమ్మిది మంది బీజేపీ సభ్యులను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ఒడిషా శాఖ అధ్యక్షుడు బసంత పాండా ప్రకటించారు.
జడ్పీ ఛైర్మన్ ఎన్నిక పరిశీలకుడిగా వెళ్లిన సమీర్ మొహంతి అధిష్ఠానం చెప్పిందంటూ ఒక వ్యక్తిని ప్రతిపాదించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక బీజేపీ కార్యకర్తలు మరొక వ్యక్తిని జడ్పీ ఛైర్మన్ పదవికి ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిని ఆయన తోసిపుచ్చడంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు.