: బెంగళూరులో నీటికి కటకట.. నీటికి రేషన్ అమలు చేసే అవకాశం!
మన దేశంలో ఐటీ పరిశ్రమకు కేంద్ర బిందువు, గ్రీన్ సిటీ అయిన బెంగళూరు నీటి కొరతతో కటకటలాడుతోంది. దీంతో బెంగళూరు ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. అక్కడి రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. బెంగళూరు నగరంలో నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించిన 15 రోజుల్లోనే పరిస్థితి తారుమారు అయింది. ఈ నేపథ్యంలో, బెంగళూరుతో పాటు చుట్టుపక్కలున్న పట్టణాల్లో సైతం నీళ్లకు రేషన్ విధానాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.
కర్ణాటకలో బెంగళూరుతో పాటు అనేక పట్టణాలు కావేరి నదీ జలాలపైనే ఆధారపడుతున్నాయి. ఆ నదిలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. సరిపడా నీరు లేకపోవడంతో, నీటిని సరఫరా చేస్తున్న సమయంలో కూడా లైన్లకు చివర్లో ఉన్న ప్రాంతాలకు నీరు అందడం లేదు. వస్తున్న నీరు కూడా చాలా మురికితో ఉంటోందని జనాలు వాపోతున్నారు.