: ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉపఎన్నిక.. బరిలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 12వ తేదీన జరిగే ఈ ఉప ఎన్నికలో దాదాపు అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ఈ ఉప ఎన్నికపై పడింది.
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సొంత పార్టీ తరపున ఆర్కేనగర్ నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ‘అమ్మ’ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అన్నాడీఎంకే భావిస్తోంది. పార్టీ తరపున శశికళ అక్క కుమారుడు దినకరన్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, వామపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకొని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వ్యూహాలు పన్నుతున్నాడు.
వీరితో పాటు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూడా తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని భావిస్తోంది. ఆ పార్టీ తరపున ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శి మదివానన్ పేరు ఖరారు చేయగా... పార్టీలోని కొంతమంది విజయ్ కాంత్ సతీమణి ప్రేమలతను పోటీలో దింపాలని కోరుతున్నారు. వీరితో పాటు ప్రజా సంక్షేమ వేదిక (పీడబ్ల్యూఎఫ్) కూడా పోటీకి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, తాను ఆర్కేనగర్ నుంచి పోటీచేస్తానని ప్రకటించిన నాటి నుంచి.. పరోక్షంగా తనపై అనేక వేధింపులు మొదలయ్యాయని జయ మేనకోడలు దీప పేర్కొన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని, లేదంటే చంపేస్తామంటూ కొంతమంది గుంఢాలు తనను బెదిరిస్తున్నారని దీప తెలిపారు.