: సమాజానికి తిరిగివ్వాలని నిర్ణయించుకున్నా... స్టార్టప్స్ లో పెట్టుబడులు పెడతా: హృతిక్ రోషన్
తాను డబ్బే లోకంగా బతికే మనిషిని కానని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ తో తన మనసులో మాటలు పంచుకున్న సందర్భంగా పలు అంశాలపై స్పందిస్తూ, సంపాదించిన దాంట్లో కొంతభాగాన్ని సమాజానికి తిరిగివ్వాలన్నదే తన లక్ష్యమని అన్నాడు. అందుకోసం విలువలు, తత్వశాస్త్ర ఆధారిత అంకుర సంస్థలు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ బాలీవుడ్ నటుడు చెప్పాడు. అందుకే తనకు సినిమాల ద్వారా వచ్చే సంతృప్తి కంటే, తన బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ ద్వారా సాధారణ దుస్తులు విక్రయించడం ద్వారా లభించే ఆత్మసంతృప్తి ఎక్కువని చెప్పాడు. పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచిన వచ్చిన అనంతరం ఫ్లిప్ కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ ముఖేష్ బన్సల్ సహకారం తీసుకున్నానని హృతిక్ తెలిపాడు.
తన బ్రాండ్ ఇప్పటికే 120 కోట్ల బ్రాండ్ గా రూపొందిందని, త్వరలోనే తాము ఇ కామర్స్ పోర్టల్ మింత్రా.కామ్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నామని చెప్పాడు. తమ బ్రాండ్ పేరు మీద మహిళలు, పిల్లల ఉత్పత్తులతో పాటు లోదుస్తులు, చలువ కళ్లద్దాలు కూడా విక్రయించనున్నామని తెలిపాడు. ఆన్ లైన్ తో పాటు సాధారణ విక్రయశాలల్లోనూ తన ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలన్నదే తన లక్ష్యమని హృతిక్ తెలిపాడు. ప్రస్తుతానికి తాను బన్సల్, అంకిత్ నగోరి స్థాపించిన ఆరోగ్య సంరక్షణ సేవల స్టార్టప్ క్యూర్ ఫిట్ తోపాటు కలారి కేపిటల్, యాక్సెల్ పార్ట్ నర్స్, ఐడీజీ వెంచర్స్ లలో పెట్టుబడి పెట్టానని తెలిపాడు.