: ‘కాఫీ విత్ కెప్టెన్’తో యువతకు చేరువ.. అదే పంజాబ్ లో కాంగ్రెస్ విజయ రహస్యం!


పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని చేపట్టనుంది. అయితే, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ గత కొంత కాలంగా చేపట్టిన కార్యక్రమాలే ఆయనని ప్రజలకు, యువతకు చేరువ చేసి విజయాన్ని కట్టబెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్  పంజాబ్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరన్న విమర్శలు ఉండేవి. ఈ దఫా ఆ అపవాదును పోగొట్టుకునే క్రమంలో రాష్ట్ర ప్రజలతో మమేకమై ప్రచారం సాగించారు.

సాధారణంగా పంజాబ్ లో యువత ప్రాధాన్యమెక్కువ. వారిని ఆకర్షించేందుకు సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉండటంతో పాటు... ‘కాఫీ విత్‌ కెప్టెన్‌’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా వేలాదిమంది యువతను నేరుగా కలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విని, మెజార్టీ యువతను తన పక్కకు తిప్పుకోగలిగారు. దీంతో పాటు ఆయనపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా లేకపోవడం కూడా కలిసివచ్చింది.

వీటితో పాటు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఆయన వ్యక్తిత్వం, పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై అకాలీదళ్‌-భాజపా కూటమి ప్రభుత్వంపై నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తూ నిలదీయడం... ఆయనకు అనుకూలించాయి. అలాగే ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేక పవనాలు కూడా కెప్టెన్ కు కలిసివచ్చాయి.  117 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పంజాబ్ లో ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు ఉండి ప్రచారం ఉండేలా ‘హల్కే విత్ కెప్టెన్’ పథకంతో అమరీందర్ సింగ్ ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవడంతో వారి అభిమానాన్ని పొందగలిగారు.

దీంతో పాటు 'నా వైఖరి నచ్చకపోతే అకాళీదళ్ కు ఓటు వేయండి... ఒకవేళ వారి తీరు నచ్చకపోతే ఆప్ కు ఓటేయండి...' అంటూ ప్రచారంలో యువతీ, యువకులకు నిర్మొహమాటంగా చెబుతూ, తన చిత్తశుద్ధిని చాటుకోవడం కూడా కెప్టెన్ కు కలిసివచ్చింది. ప్రచారంలో ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలంటూ సెంటిమెంటుతో ప్రచారం కొనసాగించారు. దీంతో ఏర్పడిన సానుభూతి కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చి ఈ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో విజయ సాధించడానికి దోహదపడింది.
 






  • Loading...

More Telugu News